animisha
Sunday, October 5, 2008
అతను...
మీలో నే చూసాను ఓ అందమైన స్వప్నం
అందులో విహరించి తెలుసుకున్నాను జీవన మాధుర్యం.
ఆ స్వప్నం నుంచి విడివడిన వేళ
ఏకాంతమైన మీ జీవన వీణని చూసి
చలించాను అనునిత్యం .
నిదురలేని నిశీధి రాత్రులలో మీరలమటిస్తుంటే
తిరిగి రాలేని ఆ సుదూర తీరాలకు, ప్రయాణించి మరీ
అతనిని తీసుకు రావాలనిపిస్తుంది.
అందుకే అతనిని వెతుక్కుంటూ బయలుదేరాను .
అతను నాకు సుపరిచితమే..
మీ మనసు పుస్తకంలో అతనిని చదివాను .
మీ కళ్ళ వెనుక దాగిన కన్నీటిలో అతని రూపాన్ని చుసాను .
మీ స్మృతి పారవశ్యపు దరహాసంలో ,
అతని మనసు లాలిత్యాన్ని అనుభవించాను.
అతని గురించి చెబుతున్నప్పుడు
మెరిసే మీ కళ్ళ మెరుపులో
అతని ఔన్నత్యాన్ని గుర్తించాను.
కానీ , అతనిని కలుద్దామని వెళ్ళిన నాకు నిరాశే మిగిలింది.
ఎంతో గాలించాను,
మరెంతో శోధించాను.
అయినా అతని జాడ ప్రశ్నార్ధకం.
నిరుత్సాహంతో , నిస్సత్తువతో ,నిర్జీవంగా ,
తిరిగివచ్చిన నాకు ,
మిమ్మల్ని చూడగానే
తన ఉనికి అవగతమైంది.
మీ ఉచ్వాస నిచ్వాసల్లో
సమాగమమై...
నిశ్చలంగా ,నిజరామరంగా,నిలిచి ఉన్నతనను ,
బాహ్య ప్రపంచంలో ఎక్కడ వెతుకుతున్నావ్ అంటూ
చిలిపిగా ప్రశ్నిస్తూ కనిపించాడు ,
"తను "
మీలో మమేకమై...
